కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఇట్యాల: ఇట్యాల, గొర్రెగుట్ట గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ గజ్జల జయలక్ష్మి సురేష్ కొబ్బరికాయ కొట్టి శుక్రవారం లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గజ్జల జయలక్ష్మి సురేష్ మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయిరే శ్రీనివాస్, ఇట్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ బాబు, వార్డు సభ్యులు వసాకే బాబురావు, చాపిడె శ్రీకాంత్, సూర మహేష్, వసాకే తిరుపతి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








