ముంబై: మహారాష్ట్రలోని డొంబివిలి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలితో పాటు ఇతర వైద్య సిబ్బందిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)కు చెందిన కార్పొరేటర్ రమేశ్ మాత్రేను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. థాణేలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన జూలై 6న కళ్యాణ్-డొంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) పరిధిలోని శాస్త్రి నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. అప్పుడే జన్మించిన ఓ శిశువుకు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో బెడ్ అందుబాటులో లేకపోవడంతో, మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రమేశ్ మాత్రే తన అనుచరులతో కలిసి ఆసుపత్రికి చేరుకుని వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో రమేశ్ మాత్రే మహిళా వైద్యురాలిపై వెనుక నుంచి వచ్చి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాడిలో మరో వైద్యుడు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్య వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు రమేశ్ మాత్రేతో పాటు మరో ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, నేరపూరిత బెదిరింపులు, అల్లర్లకు పాల్పడటం తదితర ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న రమేశ్ మాత్రేను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ దాడికి నిరసనగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఓపీ సేవలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను రమేశ్ మాత్రే ఖండించారు. తాను మహిళా వైద్యురాలిపై దాడి చేయలేదని, తమ ఫిర్యాదును పట్టించుకోకుండా ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండటంతో ఫోన్‌ను మాత్రమే తట్టానని ఆయన వివరణ ఇచ్చారు. కాగా, సీసీటీవీ దృశ్యాలను ఆధారంగా తీసుకుని పోలీసులు ఘటనపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు.








