గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఎఫ్ఏ కైలే ప్రసన్నకుమారి అవినీతికి పాల్పడినట్లు కూలీలు చేసిన ఫిర్యాదు పై మంగళవారం పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీడీవో వెంకటేశ్వరరావు బహిరంగ విచారణ చేపట్టారు. కూలీలు కోరేటి చిట్టిబాబు, ఇశ్రాయేలు, కూరపాటి మాణిక్యం లు ఫీల్డ్ అసిస్టెంట్ కైలే ప్రసన్న కుమారి పనికి రాని వారికి అటెండెన్స్ వేసి లక్షల రూపాయలు గోల్మాల్ చేశారని ఆరోపించారు. ఆమె అకౌంట్లో గత కొన్ని ఏళ్లుగా కలిపి 1.51 లక్షల రూపాయలు జమ చేసుకున్నట్లుగా చెప్పారు. ఇది తప్పు కాదా అని అధికారులను ప్రశ్నించారు. అదేవిధంగా కైలే అజయ్ కుమార్ ఖాతాలో 1057 రూపాయలు, యనమల శ్రీనివాస్ ఖాతాలో 51 వేల రూపాయలు, కైలే జయలక్ష్మి ఖాతాలో 23 వేల రూపాయలు వేసినట్లుగా ఫిర్యాదు చేశారు. వీరంతా ఏ రోజు ఉపాధి పనికి రాలేదని అధికారులకు తెలిపారు. ఆ తర్వాత విచారణ అధికారి వెంకటేశ్వరరావు కొంతమందిని పిలిపించి మీకు ఖాతాలో డబ్బులు పడినాయా? లేదా?, పనులకు వెళ్లారా లేదా అని అడగ్గా తాము పనులకు వెళ్ళామని వారు చెప్పడంతో రికార్డు చేసుకున్నారు. ఫిర్యాదు దారులు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని అధికారులు రూడీ చేసుకున్నారు. అయితే ప్రసన్న కుమారి చెప్పిన విధంగానే అధికారులు కూడా వింటున్నారంటూ ఫిర్యాదుదారులు మండిపడ్డారు. అధికారుల విచారణ సరిగా లేదంటూ బాయ్ కట్ చేసి పక్కకు వెళ్లి పోయారు. దీంతో అధికారులు తమ విచారణను ముగించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉపాధి కూలీలు అధికారుల వైఖరి సరికాదంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పనులకు రాకున్నా వారి ఖాతాల్లో డబ్బులు వేసిన వారిని వివరాలు మసిపూసి మారేడుగా చేశారని ఇశ్రాయేల్ ఆరోపించారు. ఎఫ్ ఏ ఖాతాలో డబ్బులు వేయకూడదని నిబంధన ఉన్న ఆమె ఖాతాలో డబ్బులు ఎందుకు వేశారని అడిగిన అధికారులు సరిగా సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కు, విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల నికిత, వి. అనిత, జోజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పథకం ఏపీఓ, గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ కూడా హాజరయ్యారు.
ఎంపీడీవో వివరణ..
ముస్తాబాద్ లో ఎఫ్ ఎ ప్రసన్న కుమారిపై చేసిన ఆరోపణలలో వాస్తవం కనిపించలేదని చెప్పారు. ఫిర్యాదుదారులు చెప్పిన పేర్లు పరిశీలించగా వారు పనికి వచ్చినట్టుగా తమకు చెప్పారని తెలిపారు.