ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక ప్రకటన చేశారు. అమరావతిలో టాటా గ్రూప్ సహకారంతో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) గ్లోబల్ లీడర్ షిప్ ఆన్ కాంపిటేటివ్ నెస్ కేంద్రం (జీఎల్ సీ) ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
“గుణాత్మక విద్య దిశగా విద్యా వ్యవస్థలో మార్పులు, భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణం వంటి అంశాల్లో సేవలు అందించేందుకు జీఎల్ సీ ఎంతో పేరున్న అంతర్జాతీయ, భారత సంస్థలతో కలిసి పనిచేస్తుంది. శిక్షణ, సలహాలు తదితర సేవల ద్వారా పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంపొందించడంపై దృష్టిసారిస్తుంది. పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాల కల్పన, ఏపీ ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, భారత్ విజన్-2047కు తోడ్పాడు అందించడం వంటి అంశాలే లక్ష్యంగా జీఎల్ సీ కార్యాచరణ ఉంటుంది” అని చంద్రబాబు తన ట్వీట్ లో వివరించారు.