హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ మరో ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులను ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్ (2025-26)’కు ఎంపిక చేసింది.
పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచినందుకు ఈ గుర్తింపు లభించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సేవల నాణ్యతను మెరుగుపరచడంలో తెలంగాణ పోలీసులు సాధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రశంసించింది.
ఈ నెల 19న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ‘పాస్‌పోర్ట్ సేవా దివస్’ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించడం గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు.
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన ‘వెరిఫాస్ట్’ మొబైల్ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యాప్ ద్వారా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలోనే దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, నివేదికలను తక్షణమే ఆన్‌లైన్‌లో సమర్పించే అవకాశం కల్పించారు. దీంతో వెరిఫికేషన్ ప్రక్రియలో జాప్యం గణనీయంగా తగ్గడంతో పాటు సేవల పారదర్శకత కూడా పెరిగింది.
‘వెరిఫాస్ట్’ అమలు తర్వాత పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన వేగం పెరగడంతో వేలాది మంది దరఖాస్తుదారులు త్వరితగతిన సేవలు పొందుతున్నారు. సాంకేతికత ఆధారిత ఈ వినూత్న విధానం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీసులు చేపడుతున్న సంస్కరణలకు ఈ జాతీయ అవార్డు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించి పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.








