అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కీలక సింగపూర్ పర్యటనకు బయల్దేరారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులకు అంతర్జాతీయ సహకారం సాధించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, సాంకేతిక మరియు పారిశ్రామిక రంగాల్లో భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. సీఎం వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఈడీబీ సీఈఓ షన్మోహన్తో పాటు సీఆర్డీఏ అధికారుల బృందం కూడా పర్యటనలో పాల్గొంటోంది.
సింగపూర్ కాలమానం ప్రకారం పర్యటన తొలి రోజున భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. అలాగే యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్‌తో విందు సమావేశంలో పాల్గొని పట్టణాభివృద్ధి, సుస్థిర నగరాల నిర్మాణంపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్, గూగుల్ క్లౌడ్ ఏపీఏసీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్, వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్లతో భేటీ కానున్నారు. అలాగే సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్లతోనూ సమావేశమై ద్వైపాక్షిక సహకారం, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.
పర్యటన రెండో రోజున కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘సీబీఎన్@361’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ఏపీఏసీ సెమికండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ రంగాల పెట్టుబడుల అవకాశాలను ప్రోత్సహించనున్నారు. సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో అమరావతి మాస్టర్ ప్లానింగ్ అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
అలాగే సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్తో సమావేశమై పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించనున్నారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం, అనంతరం వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్స్ అలీ, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్‌ను పరిశీలించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పొందనున్నారు.
పర్యటన చివరి దశలో సీఐఐ భాగస్వామ్యంతో నిర్వహించే ‘పార్టనర్షిప్ సమ్మిట్-2026’ బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారిశ్రామిక విధానాలను అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు వివరించనున్నారు. ఈ పర్యటన ద్వారా అమరావతి అభివృద్ధికి కొత్త ఊపు లభించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు ఆకర్షితమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
రెండు రోజుల పర్యటన అనంతరం జూన్ 16 రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరిగి రానున్నారు.








