నెల్లూరు జిల్లా,మర్రిపాడు మండలంలోని భీమవరం మరియు పొంగూరు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించినట్లు మర్రిపాడు మండల వ్యవసాయ అధికారి ఎస్. రామ్మోహన్ తెలియజేశారు. భీమవరం గ్రామంలో వరిలో ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుతూ నత్రజని ఎరువైన యూరియాను ఒక్కసారిగా కాకుండా మూడు దఫాలుగ వేసుకున్నట్లయితే తెగుళ్లు మరియు పురుగులు ఎక్కువగా ఆశించవని, పైపాటుగా ఎట్టి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులు వాడవద్దని, చిరు పొట్ట దశలో పొటాషియం ఎరువును తప్పకుండా వేసుకున్నట్లయితే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు అని తెలియజేశారు. వరిలో సూక్ష్మ పోషకమైన జింక్ లోపించినట్లయితే వరి ఆకుల పై ఇనుము తుప్పు మచ్చలు కనిపిస్తాయని దీని నివారణకు జింక్ సల్ఫేట్ ఎకరాకు 400 గ్రాములు పిచికారు చేసుకున్నట్లయితే సరిపోతుందని తెలియజేశారు. పొంగూరులో పొగాకు పంటను పరిశీలించి పొగాకు ఆకు ముడత వ్యాధి ( టుబాకో లీఫ్ కర్లే) ఉన్నట్లు గుర్తించి ఈ వ్యాధి సోకిన ఆకులు చిన్న సైజులో ఉంటాయి క్రిందికి చుట్టుకుపోయి మెలికలు తిరిగినట్లు ఉంటాయి. ఈ వ్యాధి తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని ఒక ఎకరాకి ఏసీటమీప్రైడ్ 20% SP 60 గ్రాములు పిచికారి చేసుకున్నట్లయితే తెల్ల దోమను నివారించుకోవచ్చు అన్నారు.ఈ వ్యాధి సోకిన మొక్కలను పొలం నుంచి దూరంగా పీకి పడేయాలి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విఏఏ లు ప్రవీణ్, పెంచలయ్య, వెటర్నరీ అసిస్టెంట్ రామకృష్ణ మరియు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/01/కనీసం-ఇద్దరు-పిల్లలుంటేనే-స్థానిక-ఎన్నికల్లో-పోటీకి-అర్హత-_-ఎపి-సీఎం-చంద్రబాబు.webp)