ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను క్రమంగా కోలుకుంటున్నానని వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి లో శనివారం నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. కొంతకాలంగా సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స నిర్వహించారు.
శస్త్రచికిత్స అనంతరం తన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, అభిమానులకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పలువురు నేతల ట్వీట్లకు స్పందిస్తూ తన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
పవన్ ఆరోగ్యంపై ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, “కల్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు సాధారణ కార్యకలాపాలకు రావడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చు” అని తెలిపారు. దీనికి పవన్ కల్యాణ్ స్పందిస్తూ, అన్నయ్య ప్రేమ, ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే కోలుకుని ప్రజాసేవలో తిరిగి చేరతానని పేర్కొన్నారు.
మరో సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆయన నూతన ఉత్సాహంతో తిరిగి వస్తారు” అని తెలిపారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశం పంపారు. దీనికి స్పందించిన పవన్ కల్యాణ్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
వీరితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రముఖులు కూడా పవన్ ఆరోగ్యం కోసం శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తి విశ్రాంతి అనంతరం త్వరలోనే విధుల్లోకి తిరిగి చేరతారని జనసేన వర్గాలు వెల్లడించాయి.








