contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మే10 నాటికి భూ రికార్థుల పరిశీలన పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రభాకర రెడ్డి

పార్వతీపురం : జిల్లాలో భూ రికార్డుల పరిశీలన, మ్యూటేషన్ కేసుల పరిష్కారం, డేటా సవరణలు నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 10 నాటికి క్షేత్ర స్థాయిలో భూ రికార్డుల పరిశీలన పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

మే 13 నాటికి మ్యూటేషన్ పెండింగ్ కేసులు లేకుండా చూడాలని, మే 17 నాటికి ఆధార్ లింకింగ్, డేటా సవరణలు పూర్తి చేయాలని సూచించారు. రీ సర్వే ప్రక్రియ అనుకున్న వేగంతో సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, ఎఫ్‌పీఓఎల్‌ఆర్ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ-కేవైసీ శాతం 100కు చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

భూమికి సంబంధించిన రికార్డులు రెండు విధాలుగా ఉంటాయని—సర్వే రికార్డుల్లో భూమి హద్దులు, కొలతలు నమోదు కాగా, రెవిన్యూ రికార్డుల్లో యజమాని వివరాలు ఉంటాయని వివరించారు. రీ సర్వే సమయంలో తహసీల్దార్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పాల్గొని, ప్రతి అంశాన్ని మినిట్స్ రూపంలో నమోదు చేయాలని ఆదేశించారు.

రిజిస్ట్రేషన్ ద్వారానే మ్యూటేషన్ పరిష్కారం సాధ్యమని పేర్కొన్న కలెక్టర్, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, భూ రికార్డుల నవీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. గ్రామ స్థాయిలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రెవిన్యూ క్లినిక్‌కు వచ్చిన దరఖాస్తులపై స్పష్టమైన పురోగతి కనిపించాలని, ప్రతి సోమవారం వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన కేసుల వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు రెవిన్యూ సేవలు మరింత చేరువ కావాలని, వేగవంతమైన పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత, వివిధ మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :