కొమరాడ (చంద్రంపేట) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొమరాడ మండలం చంద్రంపేట గ్రామంలో వేడుకలు స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్, ‘వృద్ధ మిత్ర’ కోఆర్డినేటర్ కొమ్మిరి కృష్ణమూర్తి తన సేవాభావాన్ని చాటుకున్నారు. సుమారు 40 మంది నిరుపేద వృద్ధులు మరియు మహిళలకు ఆయన స్వంత ఖర్చులతో చీరలు, పంచెలు, తువ్వాళ్లు పంపిణీ చేశారు.
ఈ వస్త్రదాన కార్యక్రమం కురుపాం నియోజకవర్గం ఏఎంసి వైస్ చైర్మన్ శంకరరావు ఆధ్వర్యంలో జరిగింది. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే కృష్ణమూర్తిని గ్రామ పెద్దలు, నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎలమంచి కృష్ణ, అరసాడ ప్రసాద్, జక్కవ రవికుమార్, గరుగుబిల్లి రవి, పట్నాన శంకరరావు, బొండపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిస్తూ, వృద్ధుల అవసరాలను గుర్తించి సహాయం చేసిన హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.








