సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం వాటిల్లకుండా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడతామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులు, అధికారతో కలిసి రహదారులు మరియు భవనాల శాఖ అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మియాపూర్ నుండి పటాన్చెరు వరకు చేపడుతున్న ఆరు వరసల జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. విస్తరణ మూలంగా పటాన్చెరువు పట్టణంలో వ్యాపార సమస్యలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే జిఎంఆర్ ఇటీవల తమ దృష్టికి తీసుకుని రావడంతో.. క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని గణపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ మాట్లాడుతూ.. రహదారి విస్తరణ మూలంగా వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం కలగకుండా ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆర్ అండ్ బి అధికారులు, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.