పాకాల: తిరుపతి జిల్లా పాకాల మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, అమర రాజా గ్రూప్ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గురువారం మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పాకాల సబ్ రిజిస్ట్రార్ రహ్మతుల్లా పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సౌకర్యాలను గల్లా జయదేవ్ పరిశీలించారు. గతంలో పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం గల్లా రామచంద్రరావు సహకారంతో ఆధునిక సదుపాయాలతో కూడిన విశాలమైన నిరీక్షణ శాల (వెయిటింగ్ హాల్)ను నిర్మించారు. ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించే విధంగా నిర్మించిన ఈ హాల్లో ప్రజలకు అవసరమైన పలు సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.
కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన వాతావరణంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ నిరీక్షణ శాల స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. కార్యాలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ఉపయోగకరమైన సౌకర్యాన్ని కల్పించినందుకు గల్లా కుటుంబానికి రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చే ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ రహ్మతుల్లా మాట్లాడుతూ, కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా గల్లా రామచంద్రరావు అందించిన సహకారం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజా సేవల పట్ల గల్లా కుటుంబం చూపిస్తున్న నిబద్ధత ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించేందుకు కృషి చేస్తామని గల్లా జయదేవ్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








