వెల్దుర్తి/తూప్రాన్ డివిజన్ : నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‌లో శనివారం ఉచిత మెగా కంటి శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
వాసన్ ఐ కేర్ హాస్పిటల్‌కు చెందిన వైద్య బృందం శిబిరంలో పాల్గొని ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు వైద్యులు ప్రత్యేక సలహాలు అందజేశారు. కంటి సమస్యలు ఉన్న వారికి అద్దాలు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ శిబిరాన్ని సుమారు 800 మందికి పైగా గ్రామ ప్రజలు, వృద్ధులు, మహిళలు వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం తమకు అత్యంత ముఖ్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








