అమెరికాలో అధిక వేతనం పొందుతున్న ఓ ఎన్నారై టెక్కీకి హెచ్-1బీ వీసా లాటరీలో ఎంపిక కాకపోవడంతో ఊహించని దెబ్బ తగిలింది. ఏటా సుమారు 2 లక్షల డాలర్లు (దాదాపు రూ.1.6 కోట్లు) సంపాదిస్తున్న ఆయన, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయి భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం రూ.40 లక్షల అప్పుతో పాటు, దేశంలోని కఠినమైన ఉద్యోగ మార్కెట్లో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. “హెచ్-1బీలో ఎంపిక కాకపోవడంతో భారత్‌కు బలవంతంగా తిరిగి వచ్చాను. ఇక్కడి టెక్ ఇంటర్వ్యూల కఠినత నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది” అనే శీర్షికతో రెడిట్‌లో పోస్ట్ చేశారు. తన వీసా గడువు ముగిసిపోవడం, అలాగే పనిచేస్తున్న అమెరికా కంపెనీకి భారత్‌లో శాఖ లేకపోవడంతో బదిలీ అవకాశం లేకపోయిందని చెప్పారు.
అమెరికాలో ఉన్న స్థిరమైన ఆదాయం ఒక్కసారిగా లేకపోవడం తనకు పెద్ద షాక్‌గా మారిందని పేర్కొన్నారు. “ప్రస్తుతం భారత జాబ్ మార్కెట్ అతిపెద్ద సవాలుగా మారింది. పోటీ చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇంటర్వ్యూల స్థాయి చాలా కఠినంగా ఉంది. అమెరికాతో పోలిస్తే ఇక్కడ అడిగే ప్రశ్నలు మరింత అడ్వాన్స్డ్గా అనిపిస్తున్నాయి” అని ఆయన వాపోయారు. రూ.40 లక్షల అప్పు భారం తన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తోందని కూడా చెప్పారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలు సూచనలు చేశారు. “ముందుగా అధిక జీతంపై ఆశలు తగ్గించుకుని, ఏదైనా ఉద్యోగంలో చేరడంపై దృష్టి పెట్టండి” అని ఒకరు సలహా ఇచ్చారు. “మీ అంతర్జాతీయ అనుభవం, గతంలో పొందిన భారీ జీతం వంటి అహాన్ని పక్కనపెట్టండి. ప్రస్తుతం రూ.15–20 లక్షల ప్యాకేజీ వచ్చినా మంచి అవకాశంగానే భావించాలి” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
అమెరికా జీతాలతో భారత పరిస్థితులను పోల్చుకోవద్దని, స్థానిక మార్కెట్‌కు అనుగుణంగా అంచనాలు మార్చుకోవాలని చాలా మంది సూచించారు. ఈ కష్టకాలం నుంచి బయటపడేందుకు సలహాలు ఇవ్వాలని ఆ టెక్కీ తన పోస్ట్‌లో కోరారు.








