contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో సరికొత్త హెల్త్ స్కీం – 47 రకాల వైద్య పరీక్షల పథకానికి ఆమోదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడంపై కాకుండా, వాటిని ముందుగానే గుర్తించి నివారించడమే లక్ష్యంగా ఒక వినూత్న పథకానికి ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రంలో గుర్తించిన ప్రతి వ్యక్తికి మొత్తం 47 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904 మొబైల్ మెడికల్ యూనిట్ల (104 వాహనాలు) ద్వారా గ్రామస్థాయిలో అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం రూ.163 కోట్లు ఖర్చు చేయనుండగా, సుమారు 57 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ప్రతి మొబైల్ యూనిట్ రోజుకు సుమారు 20 మందికి పరీక్షలు నిర్వహించనుంది.

ప్రస్తుతం 104 వాహనాల్లో కేవలం 6 రకాల సాధారణ పరీక్షలను మాత్రమే రాపిడ్ కిట్ల ద్వారా నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ వాహనాల్లో సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ యంత్రాలు, సీబీసీ అనలైజర్లు వంటి ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షన్ వంటి 11 కేటగిరీలలో 47 రకాల కీలక పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ పరీక్షల ద్వారా ప్రతి వ్యక్తికి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు (EHR) మరియు వ్యాధుల ప్రొఫైల్ సిద్ధం చేయనున్నారు. ఈ సమాచారాన్ని ‘సంజీవని’ పథకం కింద భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు, అవసరమైన సూచనలు ఇవ్వడానికి వినియోగించనున్నారు.

రాబోయే రెండు నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :