వరంగల్ జిల్లా, ఉర్సుగుట్ట: వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలోని ఓ బార్ వద్ద పోలీసులకు సంబంధించిన ఘర్షణ ఘటన కలకలం రేపింది. బార్‌లో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. బెటాలియన్ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని, షర్ట్ వేసుకుని వెళ్లాలని సంతోష్ రెడ్డి సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.
ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. అనంతరం బీట్ కానిస్టేబుల్ లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు, అక్కడున్న బార్ సిబ్బంది, కొందరు స్థానికులు కూడా అతడిపై దాడి చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఏదిఏమైనా సరే యూనిఫార్మ్ లో ఒక పోలీస్ కానిస్టేబులు మరో కానిస్టేబులు లేదా సామాన్య పౌరుడైన ఆ స్తానంలో ఉంటె తన పై అధికారికి సమాచారం అందించి పోలీసు సిబ్బందిని పిలిపించి ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అతను చేసిన నేర నిరూపణ పై అతని పై కేసు నమోదు చేయవచ్చు. కానీ ఆలా చేయకుండా కానిస్టేబులు సంతోష్ రెడ్డి స్థానికులతో కలిసి ఒక వ్యక్తి పై దాడి చేయడం చట్టవిరుద్ధం. చట్టం కానిస్టేబులు సంతోష్ రెడ్డి కి చుట్టం కాదు. యూనిఫార్మ్ లో ఉన్నంత మాత్రాన ఏమైనా చేస్తే చెల్లుతుందని అనుకోవడం పొరపాటు. విషయం పై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎవరిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారనే విషయంపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఘర్షణకు దారితీసిన అసలు కారణాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.








