ఆఫ్రికా దేశాలైన Democratic Republic of the Congo, Ugandaల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో World Health Organization ఆదివారం అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత కేసులు నమోదవగా, 88 మంది ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ Tedros Adhanom Ghebreyesus వెల్లడించారు.
అయితే ప్రస్తుత పరిస్థితి కొవిడ్-19 తరహా మహమ్మారిగా మారలేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ ‘బుండిబుగ్యో’ అనే అరుదైన ఎబోలా వేరియంట్‌గా అధికారులు గుర్తించారు.
ఈ వైరస్‌కు ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట చికిత్సలు లేదా వ్యాక్సిన్లు అందుబాటులో లేవని నిపుణులు చెబుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో గతంలో కూడా ఎబోలా వ్యాప్తి జరిగినప్పటికీ, ‘బుండిబుగ్యో’ వేరియంట్ మళ్లీ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ వేరియంట్ తొలిసారిగా 2007-2008 మధ్య ఉగాండాలో వెలుగుచూసింది. ఆ సమయంలో 37 మంది మృతి చెందారు. అనంతరం 2012లో కాంగోలోని ఇసిరో ప్రాంతంలో మరోసారి వ్యాపించి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మరోసారి ఇదే వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి.








