తిరుపతి జిల్లా, పాకాల : తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి గ్రామపంచాయతీ సూరినేని వారివల్లెకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ అరగొండ గంగాధరం ప్రస్తుతం గుజరాత్లో బీఎస్ఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 2222లో ఉన్న భూమి తమ తాతల కాలం నుంచే తమ కుటుంబ ఆధీనంలో ఉందని, గతంలో ఆ భూమిలో పంటలు సాగు చేసి పన్నులు కూడా చెల్లించామని పేర్కొన్నారు.
ఆ భూమికి పట్టా కోసం అనేక సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యులు, బంధువులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని వాపోయారు. ఇదే స్థలంలో గత ప్రభుత్వం జగనన్న కాలనీ ఏర్పాటు చేసిందని, తమకు కనీసం ఇంటి స్థలమైనా ఇవ్వాలని కోరడంతో కొంత భూమిని అలాగే ఉంచారని తెలిపారు.
ఇటీవల అదే భూమిలో ఇంటి నిర్మాణం ప్రారంభించి పునాది వేయగా, స్థానిక టీడీపీ నేత ఒకరు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. ఆ డిమాండ్‌కు ఒప్పుకోకపోవడంతో, మరుసటి రోజే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఇంటి నిర్మాణాన్ని ఆపివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులను ఆశ్రయించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని అన్నారు. దేశ భద్రత కోసం సరిహద్దులో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న తనకు స్వగ్రామంలోనే న్యాయం దక్కకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తనకు తగిన న్యాయం చేయాలని ఆయన వేడుకున్నారు.









