contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రిపోర్టర్ టీవీ కథనానికి స్పందించిన అధికారులు.. డిజిటల్ ఇండియాలో గుర్రాలే దిక్కు..

  • పశువుల బంద గ్రామానికి అధికారుల పర్యటన.. జిల్లా కలెక్టర్‌కు గిరిజనుల కృతజ్ఞతలు

అనకాపల్లి జిల్లా, వి. మాడుగుల: డిజిటల్ ఇండియా యుగంలోనూ కనీస రహదారి సౌకర్యం లేక రేషన్ బియ్యం కోసం 10 కిలోమీటర్ల దూరం గుర్రంపై ప్రయాణించాల్సిన దుస్థితిలో జీవిస్తున్న పీవీటీజీ (ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగలు) కొందు గిరిజనుల సమస్యపై రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది.

వి. మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ పరిధిలోని పశువుల బంద గ్రామంలో నివసిస్తున్న గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రిపోర్టర్ టీవీ వెలుగులోకి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులను గ్రామానికి పంపించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎమ్మార్వో గ్రామాన్ని సందర్శించకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల సమస్యలు ఎన్నో ఏళ్లుగా అలాగే ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.

రిపోర్టర్ టీవీ కథనం అనంతరం గ్రామానికి చేరుకున్న జిల్లా సివిల్ సప్లై అధికారి (DCSO) కేవీఎల్‌ఎన్ మూర్తి, సీఎస్‌ఆర్‌ఐ ఈశ్వరరావు గ్రామ పరిస్థితులను పరిశీలించి గిరిజనులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

గ్రామాన్ని సందర్శించిన అధికారులకు గ్రామస్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారులను కదిలించిన రిపోర్టర్ టీవీకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామానికి శాశ్వత రహదారి, రేషన్ పంపిణీకి సులభమైన మార్గం, ఇతర మౌలిక సదుపాయాలు త్వరితగతిన కల్పించాలని పీవీటీజీ గిరిజనులు ప్రభుత్వాన్ని కోరారు. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

డిజిటల్ ఇండియాలో గుర్రాలే దిక్కు.. అనకాపల్లి గిరిజన గ్రామాల ఆవేదన

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :