జగిత్యాల జిల్లా, మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. మెట్‌పల్లిలోని బీజేపీ నాయకుడు డాక్టర్ రఘు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకుడు డాక్టర్ చిట్నేని రఘు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు కౌన్సిలర్ మీనా సుకేందర్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని నమ్ముకొని నిబద్ధతతో సేవలు చేశానని తెలిపారు. తనతో కలిసి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఎలాంటి అధైర్యానికి గురికావద్దని సూచించారు.
పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన డాక్టర్ రఘు, స్థానిక నాయకులను ప్రోత్సహించకుండా చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నేళ్లుగా పార్టీ బలోపేతం కోసం శ్రమించినప్పటికీ తమ సేవలకు తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కోరుట్ల నియోజకవర్గంలో తనతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే తమ తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపారు.
డాక్టర్ రఘు రాజీనామా ప్రకటనతో మెట్పల్లి, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజకీయాల్లో ఈ రాజీనామాల ప్రభావం ఎలా ఉండబోతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.








