కాకినాడ : సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ, ఆగస్టు నెలాఖరు వరకు అభ్యంతరాలు స్వీకరించే అవకాశం కల్పించిన భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యగా అభివర్ణిస్తూ ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కాకినాడ కలెక్టరేట్ బస్‌స్టాప్ వద్ద ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రమణరాజు, ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రతి ఇంటికి సిబ్బందిని పంపించి స్థానికంగా నివసించే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గణనపత్రం లేకుంటే ఓటు హక్కు పోతుందనే భయాందోళనలు సృష్టించకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలను రాజకీయ పార్టీల ఓటర్లుగా కాకుండా దేశ పౌరులుగా గుర్తించి గౌరవించాలని ఆయన సూచించారు. జననం నుంచి మరణం వరకు దాదాపు అన్ని ప్రభుత్వ సేవల్లో ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నప్పటికీ, ఓటరు జాబితా విషయంలో మాత్రం ఆధార్ అనుసంధానం లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ప్రతి ఏడాది అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఆధార్ అనుసంధానం ద్వారా మరణించిన వ్యక్తుల పేర్లు, డూప్లికేట్ ఓట్లు తొలగించే అవకాశం ఉంటుందని, ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని రమణరాజు అభిప్రాయపడ్డారు. దీంతో ప్రతి ఏడాది ఓటరు జాబితా సవరణ పేరుతో జరిగే భారీ వ్యయం తగ్గడంతో పాటు ప్రజాధనం వందల కోట్ల రూపాయలు ఆదా అవుతుందన్నారు.
అలాగే ఎన్నికల్లో ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలు, వీవీప్యాట్ లెక్కింపుపై వివాదాలు కూడా తగ్గే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. విదేశీయులు ఆధార్ పొందినందున వారికి ఓటు హక్కు వస్తుందనే ఆందోళనలను ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నప్పటికీ, కోట్లాది మంది భారతీయులను మాన్యువల్ వెరిఫికేషన్ పేరిట ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని విమర్శించారు.
సుప్రీంకోర్టు, పార్లమెంట్, రాజ్యసభ సమన్వయంతో ఆధార్ ఆధారిత సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారత ఎన్నికల సంఘాన్ని కోరారు.
దేశహితం, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కోట్లాది ప్రజల సంతకాలతో దేశ రాజధానిలోని రాష్ట్రపతి కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు దూసర్లపూడి రమణరాజు ప్రకటించారు.








