అనకాపల్లి జిల్లా, వి. మాడుగుల: డిజిటల్ ఇండియా యుగంలోనూ కనీస రహదారి సౌకర్యం లేక రేషన్ బియ్యం కోసం 10 కిలోమీటర్లు గుర్రంపై ప్రయాణించాల్సిన దుస్థితి పీవీటీజీ (ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగలు) కొందు గిరిజనుల జీవితాన్ని ప్రతిబింబిస్తోంది. అనకాపల్లి జిల్లా వి. మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ పరిధిలోని పశువుల బంద గ్రామంలో నివసిస్తున్న గిరిజనులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.
గ్రామంలో ప్రస్తుతం ఎనిమిది పీవీటీజీ కుటుంబాలు సామలమ్మ కొండపై నివాసం ఉంటున్నాయి. వీరు రేషన్ బియ్యం తీసుకోవాలంటే అవురువాడ పంచాయతీ కేంద్రంలోని పెద్దసారడ గ్రామానికి సుమారు 10 కిలోమీటర్లు గుర్రాలపై ప్రయాణించి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. గ్రామంలో ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నప్పటికీ వాటిని పొందేందుకు కూడా ఇదే మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనారోగ్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా గుర్రాలపైనే ప్రయాణించాల్సి వస్తోందని, రహదారి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు పేర్కొన్నారు. గతంలో గ్రామంలో 20 కుటుంబాలు ఉండేవని, కనీస సౌకర్యాలు లేకపోవడంతో 12 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయాయని తెలిపారు.
తాము సామలు, జొన్నలు, అల్లం, పసుపు వంటి పంటలను సాగు చేస్తున్నామని, వాటిని సంతకు తీసుకెళ్లి విక్రయించేందుకు కూడా గుర్రాలనే వినియోగిస్తున్నామని చెప్పారు. “దేశం డిజిటల్ ఇండియా వైపు పరుగులు తీస్తుంటే, మేము మాత్రం ఇప్పటికీ గుర్రాలపైనే ప్రయాణిస్తున్నాం” అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు నిర్మాణం కోసం అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేదని తెలిపారు. జడ్పీ పాలకవర్గ సమావేశాల్లోనూ తమ సమస్యను ప్రస్తావించామని, విశాఖపట్నంలో డోలీతో నిరసనలు చేపట్టామని పేర్కొన్నారు. గతంలో మాడుగుల నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, డిప్యూటీ ముఖ్యమంత్రికి కూడా పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా రహదారి నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసినప్పటికీ నిధులు మంజూరు కాలేదని గిరిజనులు ఆరోపించారు. తమ గ్రామాల అభివృద్ధి కోసం వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీధర్ కామేశ్వరరావు, సేదరి అప్పారావు, సేదరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు, గిరిజన సంఘం నాయకుడు గేమ్మిలి వాసు, ఎస్. భవాని, వర్షా కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, పశువుల బంద, జీలు గుల్లోవా తదితర పీవీటీజీ గిరిజన గ్రామాలకు వెంటనే రహదారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే గుర్రాలతో కలెక్టర్ కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపడతామని హెచ్చరించారు.








