ముంబాయి / తూప్రాన్ : ప్రభాదేవి ఎడన్వాల చాల్ బుద్ధ విహారంలో ముంబై తెలంగాణ బహుజన ఫోరం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 369వ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక బహుజన నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగ్ సేన్ మాలజీ మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ తన సైన్యంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రాబల్యం ఉన్న కాలంలో శివాజీకి పట్టాభిషేకం జరగబోయే సందర్భంలో జరిగిన అవమానం చరిత్రలో నమోదైందని గుర్తుచేశారు. అనంతరం ఆయన తల్లి ఆధ్వర్యంలో రెండో రాజ్యాభిషేకాన్ని శాక్తపంథ్ (బౌద్ధ) పద్ధతిలో నిర్వహించారని పేర్కొన్నారు. ఇది క్రూర వర్ణవ్యవస్థపై జరిగిన పోరాటానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
జర్నలిస్ట్ గుర్రం నరేష్ మహారాజ్ మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా శివాజీ జయంతిని నిర్వహించిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే అని చరిత్రను స్మరించారు. శివాజీ మహారాజ్ ఆలోచనలతో ప్రేరణ పొందుతూ, సమాజంలో విభజించి పాలించే వ్యవస్థను కూలదోసి బహుజనులంతా ఐక్యంగా మహనీయుల బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బుద్ధ విహార్ ప్రముఖులు మంగేష్ అహివలె, సచిన్ బన్సోడే, రవ్వ శ్రీహరి పద్మశాలి, గాజుల రాజేందర్, ఎనగందుల గౌతమి నాయి, యానం రూప రజక, ఎన్. గంగారాం రజక, కునారపు లక్ష్మణ్ గంగపుత్ర, సంగ శ్రీనివాస్ మేర, చంద్రకాంత్ బండారే, సామల లక్ష్మణ్ యాదవ్, కొండేటి గంగాధర్, భీంరత్న మాలజీ, చంద్ అహ్మద్, మూలనివాసి మాలజీ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, సమాజ ఐక్యతకు సంకల్పం చేశారు.








