- మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి – ఎస్పీఎం కార్మికుల ఆవేదన
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్: “కంపెనీ పునఃప్రారంభమై ఏడేళ్లు గడుస్తున్నా మా బతుకులు మాత్రం ఇంకా చీకట్లోనే ఉన్నాయి” అంటూ సిర్పూర్ పేపర్ మిల్ (JK) శాశ్వత కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మేరకు పర్మినెంట్ కార్మికుడు విప్పులూరి శ్రీనివాస్ పత్రిక మిత్రులతో మాట్లాడారు.
స్థానిక కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా ఇతర రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018లో మిల్లు పునఃప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 200 మంది కార్మికులు ఇప్పటికీ విధులకు దూరంగానే ఉన్నారని వారు పేర్కొన్నారు. మెడికల్ పరీక్షలు పూర్తి అయినప్పటికీ నియామకాలు జరగకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తున్నదని తెలిపారు.
యాజమాన్యం కోర్టును ఆశ్రయించి కార్మిక సంఘాల ఎన్నికలను అడ్డుకోవడం వల్ల తమ సమస్యలను చెప్పుకునే వేదిక కూడా లేకుండా పోయిందని కార్మికులు ఆరోపించారు. స్థానిక నాయకులు, కార్మిక శాఖ అధికారులు తమ బాధ్యతను విస్మరించి ప్యాకేజీలకు లొంగిపోయారని విమర్శించారు.
“కుటుంబ పోషణ భారంగా మారింది. మా ఓపిక నశించింది. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం” అని పర్మినెంట్ కార్మికుడు విప్పులూరి శ్రీనివాస్ హెచ్చరించారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని, మిల్ యాజమాన్యాన్ని కోరుతున్నారు.








