మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి నడిమి తాండలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ప్రమాదవశాత్తు నివాస పూరిగుడిసెకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమవడంతో నగదు, విలువైన పత్రాలు, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిమి తాండకు చెందిన కాట్రోత్ చంద్రు నాయక్ నివాసం ఉంటున్న పూరిగుడిసెలో అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో గుడిసె పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
ఈ ఘటనలో ఇంటి నిర్మాణం కోసం దాచిపెట్టిన రూ.1.75 లక్షల నగదు, ఇంట్లో ఉన్న బట్టలు, గృహోపకరణాలు, ఆధార్ కార్డులు, పట్టా పాస్ పుస్తకాలు తదితర ముఖ్యమైన పత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.
ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంతో కుటుంబం నిరాశ్రయులుగా మారిందని స్థానికులు తెలిపారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం మంజూరు చేయాలని గవ్వలపల్లి గ్రామ సర్పంచ్ బాణావత్ అనసూయ డిమాండ్ చేశారు. అలాగే నివాసం కోల్పోయిన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.








