contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉప్పు లింగాపూర్లో అడ్డాగా మారిన శిశు విక్రయాలు

మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామం శిశు విక్రయాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గ్రామంలో ఇటీవల రెండు శిశు విక్రయాల ఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన తండాలో సుమారు 25 రోజుల క్రితం ఓ శిశువును విక్రయించిన ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న తండా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో శిశువును కొనుగోలు చేసిన వ్యక్తులు తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనకు ముందే మరో శిశు విక్రయం జరిగినట్లు సమాచారం బయటకు వచ్చింది. గ్రామానికి చెందిన ఏకలవ్యుడు సాయిలు కుమార్తె మమత భర్త చిన్నా 2024లో మరణించడంతో ఆమె తన తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. మమత 2026 ఏప్రిల్ 17న మగ శిశువుకు జన్మనిచ్చింది. తీవ్ర పేదరికం, కుటుంబ పోషణ భారం కారణంగా ఆ శిశువును వెల్దుర్తికి చెందిన ఓ వ్యక్తికి ఏకలవ్యుడు కిష్టయ్య ద్వారా విక్రయించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. శిశువు ఆచూకీ, విక్రయానికి సంబంధించిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

అయితే బాలల సంరక్షణ బాధ్యతలు నిర్వహించే అధికారులు శిశు విక్రయాలు జరిగిన తర్వాత మాత్రమే స్పందిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పేదరికం, అవగాహన లోపం కారణంగా ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని, ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని వారు విమర్శించారు.

శిశు విక్రయాల వంటి అమానుష ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో బాలల సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విచారణలో బాలల సంరక్షణ అధికారి శంకర్ గౌడ్, పోలీసు అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఘటనలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :