కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: “ON GOVT DUTY” బోర్డు ఉంటే చట్టాలు చుట్టాలా? నిబంధనలు సామాన్యులకేనా? ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించవా? అనే ప్రశ్నలు ప్రస్తుతం కాగజ్‌నగర్ పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకే వాహనానికి రెండు రకాల నంబర్ ప్లేట్లు అమర్చి నిబంధనలను బేఖాతర్ చేసిన విద్యుత్ శాఖ ఉద్యోగి వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.
అసలు ఏమైంది?
పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన వాహనం (TG 20 6571)తో వచ్చారు. అయితే, ఆ వాహనాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వాహనం ముందు భాగంలో వైట్ నంబర్ ప్లేట్ (ప్రైవేట్), వెనుక భాగంలో ఎల్లో నంబర్ ప్లేట్ (కమర్షియల్) ఉండటం అందరినీ షాక్‌కు గురి చేసింది.
“ON GOVT DUTY” బోర్డు ఉంటే చట్టాలపై మినహాయింపా?
వాహనంపై “ON GOVT DUTY – TS NPDCL” బోర్డు కూడా ఉండటంతో, “ప్రభుత్వ పనిలో ఉన్నాం” అన్న పేరుతో నిబంధనలు ఉల్లంఘించవచ్చా? అనే చర్చ మొదలైంది. ఇది సాధారణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
ప్రజల ఆగ్రహం – సోషల్ మీడియాలో వైరల్
“సామాన్యులు చిన్న తప్పు చేసినా వెంటనే చలాన్లు వేస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగి ఇలా నిబంధనలు అతిక్రమిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అంటూ పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది కాస్తా వైరల్‌గా మారింది.
చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
వాహన నిబంధనలతో ఆటలాడుతున్న ఇలాంటి వారిపై రవాణా శాఖ (RTO), పోలీస్ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నంబర్ ప్లేట్ల రంగులు మార్చడం చట్టరీత్యా నేరమని, సంబంధిత ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆదర్శంగా ఉండాల్సిన వారే ఇలా చేస్తే…
ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో, ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. “చట్టం అందరికీ సమానమే” అనే నమ్మకాన్ని నిలబెట్టాలంటే అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.








