రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలని కీలక తీర్మానం ప్రవేశపెట్టారు.
సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు సుమారు 20 మంది సభ్యులు ప్రసంగించే అవకాశం ఉంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా అధికారికంగా ఖరారు చేయడమే ఈ సమావేశం ప్రధాన ఏజెండాగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రత్యేకంగా, విభజన చట్టంలోని సెక్షన్ 5లోని సబ్‌సెక్షన్ 2లో “అట్ అమరావతి” అనే పదాలను చేర్చాలని ఈ తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరనున్నారు. దీనివల్ల అమరావతికి రాజధాని హోదాకు స్పష్టమైన చట్టబద్ధత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు అమరావతి పేరుపై అధ్యయనం చేసి, అదే సరైనదని సూచించగా, ఆ సూచనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2015 ఏప్రిల్ 1న జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి పేరును అధికారికంగా ఖరారు చేసింది.
ప్రస్తుతం తీసుకొస్తున్న ఈ తీర్మానం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు.







