తూప్రాన్ : గురువారం తూప్రాన్ ఆర్డీఓ జయ చంద్రా రెడ్డి ఆధ్వర్యంలో వెట్‌ల్యాండ్ మేనేజ్మెంట్పై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూప్రాన్ డివిజన్‌కు చెందిన తహసీల్దార్లు, ఇరిగేషన్ శాఖ, ఫారెస్ట్ శాఖ, పంచాయతీ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా పక్షుల సంరక్షణకు ఇవి అనివార్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా చెరువులను వెట్ల్యాండ్స్గా గుర్తిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ నోటిఫికేషన్లు జారీ చేస్తోందని వివరించారు.
తూప్రాన్ డివిజన్ పరిధిలో మొత్తం 120 చెరువులను వెట్ల్యాండ్స్గా నోటిఫై చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ చెరువుల సంరక్షణలో అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.
చివరగా చెరువుల పరిరక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, బాధ్యతతో పనిచేయాలని అన్ని శాఖల అధికారులకు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు.








