గన్నేరువరం : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఎస్సీ–బీసీ కాలనీలో ఇరుకైన రోడ్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. గురువారం కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన కారుతో ఇంటికి వస్తుండగా రోడ్డు ఇరుకుగా ఉండటంతో అదుపుతప్పి కారు టైరు పక్కనే ఉన్న మురికి కాలువలోకి దిగింది. దీంతో ఆ మార్గంలో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయి, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
స్థానికుల కథనం ప్రకారం, ఈ రహదారి చాలా ఏళ్లుగా ఇరుకుగానే ఉండటంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ఒకేసారి రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే పక్కకు తప్పుకునేందుకు కూడా తగిన స్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఇదే రోడ్డులో కార్లు, ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ప్రతి రోజు ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ప్రమాద భయంతోనే ప్రయాణం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎస్సీ–బీసీ కాలనీ ప్రధాన రహదారిని విస్తరించి, మురికి కాలువకు రక్షణ గోడలు ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు, వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.








