contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మున్సిపల్ నిధులతో ఆసుపత్రి రోడ్ల నిర్మాణం చట్టవిరుద్ధం: సామాజిక వేత్త దూసర్లపూడి

కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ తన పరిధిలోని రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పౌర సౌకర్యాల అభివృద్ధిని విస్మరించి, మున్సిపల్ జనరల్ నిధులతో ప్రభుత్వాసుపత్రి లోపల ఇంటర్నల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయడం స్థానిక ప్రభుత్వ వ్యవస్థను బలహీనపరిచే చర్య అని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు విమర్శించారు. ఈ మేరకు ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు.

పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజలు చెల్లించే ఆస్తి పన్నుల ద్వారా సమకూరే జనరల్ నిధులను మున్సిపల్ చట్టంలోని సెక్షన్లు 115, 116 ప్రకారం రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీరు, పారిశుధ్యం వంటి మున్సిపల్ సేవలకే వినియోగించాలని తెలిపారు. వీటిని ఇతర ప్రభుత్వ శాఖల పనులకు మళ్లించడం చట్ట విరుద్ధమని అన్నారు.

ఇప్పటికే 14 ప్రభుత్వ శాఖలకు చెందిన పనుల కోసం రూ.31.67 కోట్ల మున్సిపల్ జనరల్ నిధులను మళ్లించారని, అందులో వైద్య శాఖ పనులకు రూ.2.72 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసిందని, మళ్లించిన నిధులను మూడు సంవత్సరాల్లో ప్రతి ఏడాది రూ.55 లక్షల చొప్పున తిరిగి విడుదల చేయాలని సూచించినప్పటికీ ఆర్థిక శాఖ నిధుల లేమి కారణంగా ఆ ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచిందని తెలిపారు.

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేని ప్రభుత్వ శాఖలకు జనరల్ నిధులను వినియోగించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రభుత్వాసుపత్రి చుట్టూ ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయని, ముఖ్యంగా ఆర్.ఆర్. రోడ్డులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ విఫలమై మురుగు ముంపు సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ వాటిని పక్కనబెట్టి ఆసుపత్రి లోపల ఇంటర్నల్ రోడ్ల నిర్మాణానికి సిద్ధపడటం మున్సిపల్ చట్టానికి విరుద్ధమని విమర్శించారు.

వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ నిధులతోనే ఆసుపత్రి మౌలిక సదుపాయాల పనులు చేపట్టాలని, మున్సిపల్ నిధులను ఇందుకు వినియోగించడం సమంజసం కాదన్నారు. 2026-27 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి నిధులు కేటాయించిన నేపథ్యంలో ఆసుపత్రి అభివృద్ధి పనులు ఆ శాఖ ద్వారానే జరగాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నిధులు తగ్గినా, మున్సిపల్ పన్ను ఆదాయాన్ని ఆసుపత్రి అంతర్గత పనులకు మళ్లించడం సరైన నిర్ణయం కాదన్నారు.

పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుల అభివృద్ధి నిధులను వినియోగించి ఆసుపత్రి సౌకర్యాలను మెరుగుపరచాలని రమణరాజు సూచించారు. అలాగే 24 ఏళ్లుగా 18 ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు రూ.42.80 కోట్లకు చేరాయని, వాటిపై సుమారు రూ.38 కోట్ల పెనాల్టీ కూడా ఉందని తెలిపారు. ఈ బకాయిలను వసూలు చేయకుండా, మళ్లించిన జనరల్ నిధులను తిరిగి రాబట్టకుండా నగర పౌర సౌకర్యాలను నిర్లక్ష్యం చేయడం సరైన పాలన కాదని హితవు పలికారు.

అలాగే 2014 నుంచి 2023 మధ్య కాలంలో మున్సిపల్ జనరల్ నిధులను చట్టవిరుద్ధంగా మళ్లించిన వ్యవహారంలో అప్పటి ఐదుగురు కమిషనర్లు, ఇద్దరు కలెక్టర్లు, అకౌంట్స్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని **కాగ్ రిపోర్టు నంబర్–2 (2025)**లో సిఫార్సు చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :