contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కోరుట్లలో భర్త హత్య కేసు ఛేదించిన పోలీసులు

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రాంతంలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితురాలైన భార్యను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మెట్‌పల్లి డీఎస్పీ ఏ. రాములు కోరుట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. అల్లమయ్యగుట్టకు చెందిన ఇప్ప కాశిరాం (35), రజిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాశిరాం మద్యం సేవించి తరచూ ఇంటికి వచ్చి భార్య, పిల్లలను వేధించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు.

దాదాపు 20 రోజుల క్రితం కూడా రజిని తన భర్తపై కర్రతో దాడి చేయగా, స్థానికులు అడ్డుకొని కాశిరాంను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి భర్తను హత్య చేయాలని రజిని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

జూలై 8 రాత్రి కాశిరాం మద్యం సేవించి ఇంటికి వచ్చిన అనంతరం రజిని ముందుగానే పిల్లలను తన తల్లి ఇంటికి పంపించింది. అనంతరం భర్తతో వాగ్వాదానికి దిగిన ఆమె రాత్రి సుమారు 11:45 గంటల సమయంలో ఇంట్లో ఉన్న రోకలిబండతో తలపై, శరీరంలోని ఇతర భాగాలపై బలంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో కాశిరాం అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం నిందితురాలు అక్కడి నుంచి పరారై అయ్యప్పస్వామి ఆలయం వెనుక ఉన్న బంధువుల ఇంట్లో తలదాచుకుంది. నమ్మదగిన సమాచారం ఆధారంగా కోరుట్ల సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో కేసును త్వరితగతిన ఛేదించి నిందితురాలిని అరెస్టు చేసిన కోరుట్ల సీఐ, ఎస్‌ఐతో పాటు దర్యాప్తు బృందాన్ని మెట్‌పల్లి డీఎస్పీ ఏ. రాములు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :