పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకాలని లక్ష్యంగా అమెరికా–ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు శుక్రవారం పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉన్నప్పటికీ, తాజా పరిణామాలు ఈ భేటీపై అనిశ్చితిని నెలకొల్పుతున్నాయి. ఇరుదేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం ఉన్నా, చర్చలు నిర్ణీత సమయానికి ప్రారంభమవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
శాశ్వత శాంతి ఒప్పందం కోసం విస్తృతమైన రోడ్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇరాన్ మాత్రం తాము ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రణాళిక ఆధారంగానే చర్చలు కొనసాగాలని స్పష్టం చేసింది.
అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహించనుండగా, ఆయన వాషింగ్టన్ నుంచి ఇప్పటికే బయలుదేరారు. మరోవైపు, ఇరాన్ తన ప్రతినిధి బృంద వివరాలను గోప్యంగా ఉంచడం గమనార్హం. ప్రారంభంలో 10 మంది సభ్యులతో కూడిన బృందం ఇస్లామాబాద్‌కు చేరుకుంటుందని ఇరాన్ రాయబారి రెజా అమీర్ ప్రకటించినప్పటికీ, తరువాత ఆ ప్రకటనను సోషల్ మీడియా నుంచి తొలగించడం అనుమానాలకు దారితీసింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఈ చర్చలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్, ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు కొనసాగడం కష్టమని సంకేతాలిచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిలో అమెరికా నేవీకి చెందిన MQ-4C ట్రిటాన్ నిఘా డ్రోన్ అదృశ్యమవడం మరో కీలక పరిణామంగా మారింది. ఫ్లైట్రాడార్24 ప్రకారం, అత్యవసర హెచ్చరిక ఇచ్చిన కాసేపటికే డ్రోన్ రాడార్ నుంచి మాయం అయింది. ప్రమాదానికి గురైందా లేదా ఎవరో కూల్చారా అన్నదానిపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 200 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఆధునిక డ్రోన్ గల్ఫ్ ప్రాంతంలో నిఘా కోసం వినియోగంలో ఉంది.
ఇక గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సౌదీ అరేబియా తమ చమురు ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించగా, కువైట్ కూడా ఇరాన్ అనుకూల ముఠాల దాడులు పెరిగినట్లు ఆరోపించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ పరిణామాల మధ్య తన మాజీ మిత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా టక్కర్ కార్ల్సన్, మెగిన్ కెల్లీ, కాండేస్ ఓవెన్స్, అలెక్స్ జోన్స్లపై విరుచుకుపడుతూ, ఇరాన్‌కు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు చేశారు.
ఇక భద్రతా దృష్ట్యా పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రెడ్ జోన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు, కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. విదేశీ ప్రతినిధుల రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
మొత్తం మీద, పశ్చిమాసియాలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే ముందు పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ భేటీ వాస్తవంగా జరుగుతుందా? జరిగితే ఏ మేరకు ఫలితాలు ఇస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తోంది.








