అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కెపిఎస్ మెడికేర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్యులు (కర్నూలు) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం గుత్తిలోని కెపిఎస్ సినిమా థియేటర్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది.
ఈ వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున రోగులు హాజరయ్యారు. వైద్యులు బీపీ, మధుమేహం, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు, ఉదర సంబంధిత సమస్యలు, రక్తహీనత, కాలేయ వ్యాధులు వంటి అనేక రోగాలపై సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన మందులను రోగులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండీ హితేష్ మాట్లాడుతూ, మోకాళ్లు, భుజాలు, కీళ్ల సమస్యలకు సంబంధించి కీహోల్ శస్త్రచికిత్సలు, అన్ని రకాల కీళ్ల శస్త్రచికిత్సలు, అలాగే మోకాళ్లు మరియు వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఆధునిక పద్ధతుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోగులకు తక్కువ ఖర్చుతో, సులభతర విధానాల్లో వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన వారికి వైద్య చికిత్సలు మరియు శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొట్రేకే మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొట్రేకే శ్రీహరి, నాగరంగ ప్రసాద్, కార్పెంటర్ వలి, జిలాన్ తదితరులు పాల్గొన్నారు.









