తూప్రాన్, మెదక్ జిల్లా : చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేసులో తూప్రాన్‌కు చెందిన యువకుడికి పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తూప్రాన్ పట్టణానికి చెందిన అరిగే శివకుమార్ (20) డిగ్రీ చదువుతున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నాడనే సమాచారంతో పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించారు. విచారణలో అతను మరో వ్యక్తి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, దాని ద్వారా అశ్లీల కంటెంట్‌ను ఇతరులకు పంపుతున్నట్లు గుర్తించారు.
సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో ఐపీ అడ్రస్‌తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించారు. తూప్రాన్ ఎస్‌ఐ శివానందం 2025 మే 12న కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ రంగకృష్ణ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య వాదనలు వినిపించారు.
సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సుభావాలి నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసులో లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీఓ నాగరాజు కీలకంగా వ్యవహరించగా, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూడడం, నిల్వ ఉంచడం, షేర్ చేయడం లేదా సర్క్యులేట్ చేయడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తూ చట్టవిరుద్ధ కంటెంట్‌ను ప్రచారం చేసే వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ స్పష్టం చేశారు.








