కాకినాడ : కాకినాడ నగరాన్ని ఫ్లెక్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనల అమలు తూతూమంత్రంగానే సాగుతోందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు విమర్శించారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రామారావుపేట మూడు లైట్ల జంక్షన్‌లో సుమారు 15 అడుగుల ఎత్తులో టవర్ బాక్స్ తరహాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డు నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తోందని తెలిపారు. దీంతో అటు ఇటు వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
నగరంలోని టూటౌన్ ఆలయం సమీపం, దంటువారి వీధి కూడలి, జగన్నాథపురం, వెంకటేశ్వర ఆలయం రహదారి, బ్రిడ్జి ప్రాంతం, టీటీడీ జంక్షన్ విగ్రహాల వద్ద, సినిమా రోడ్, సంతచెరువు సెంటర్, మున్సిపల్ కార్యాలయం నుంచి రామకృష్ణారావుపేట వంతెన వరకు అనేక ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్స్ బోర్డులు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా మూడు లైట్ల జంక్షన్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లెక్స్ ఏర్పాటు చేసినప్పటికీ, సంబంధిత వ్యక్తులపై రూ.25 వేల జరిమానా విధించకపోవడం, బాధ్యులపై ఎలాంటి మెమోలు జారీ చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
ఫ్లెక్స్ ఫ్రీ విధానాన్ని నిజాయితీగా అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, కార్పొరేషన్ అధికారులు ప్రతి వారం తొలగించిన అక్రమ ఫ్లెక్స్‌లు, విధించిన జరిమానాల వివరాలను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల మాదిరిగా ప్రజలకు వెల్లడించాలని సూచించారు. దీంతో ఫ్లెక్స్ ఫ్రీ సిటీ అమలుపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు జిల్లా కలెక్టర్‌కు అపఖ్యాతి రాకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
నగరంలో ట్రాఫిక్ భద్రత, అందం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అక్రమ ఫ్లెక్స్‌లపై ప్రత్యేక చర్యలు చేపట్టి ఫ్లెక్స్ ఫ్రీ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని, కార్పొరేషన్ అధికారులను కోరింది.









