జగిత్యాల జిల్లా కోరుట్లలో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు మరియు అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుక యార ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానికంగా ఘన స్వాగతం లభించింది.
కోరుట్లకు చేరుకున్న న్యాయమూర్తికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సమక్షంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టులను జస్టిస్ రేణుక యార అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం నిర్మాణంలో ఉన్న కొత్త కోర్టు భవన పనులను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరణలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా జస్టిస్ రేణుక యార మాట్లాడుతూ, కొత్త కోర్టుల ఏర్పాటుతో కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని, కోర్టులపై ఉన్న పని భారం తగ్గుతుందని తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచేలా న్యాయవాదులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కోర్టుల్లో సిబ్బంది కొరత సమస్యను ప్రస్తావిస్తూ, రెగ్యులర్ నియామకాలు అత్యవసరమని అన్నారు. తాను క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవంతో, అవసరమైన అధికారుల నియామకానికి హైకోర్టును అభ్యర్థిస్తానని చెప్పారు. జిల్లాల విభజన తర్వాత అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయితే గత ఐదేళ్లుగా నియామకాలు కొనసాగుతున్నాయని, రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది భర్తీ అవుతారని వివరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.









