రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేస్తోందని, ఈ వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ సేవల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ప్రజలకు వివరించడం నేతల బాధ్యతగా స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షించారు.
రాష్ట్రం ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వం పడుతున్న కృషిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నేతలకు సూచించారు.
ప్రభుత్వంపైనా, కూటమి పార్టీలపైనా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, వివిధ మార్గాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.
“ప్రజలకు వాస్తవాలు తెలిసినప్పుడు వారు స్వయంగా విశ్లేషించుకుంటారు. పరిపాలనలో ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని వారికి వివరిస్తే, ప్రత్యర్థుల ప్రచారాన్ని ప్రజలే ఖండిస్తారు. వారు ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారతారు” అని సీఎం పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలను గ్రహించి కూటమికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
పార్టీ కార్యకలాపాలపై కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ‘కాఫీ కబుర్లు’ వంటి కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నేతలు, కార్యకర్తల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా పార్టీ సిద్ధాంతాలు వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై అభిప్రాయాలు సేకరించగలుగుతున్నామని చెప్పారు.
పార్టీ కార్యకర్తల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారి విద్య, వైద్యం, ఉపాధి కోసం ‘ఎథిక్ ఎకనమిక్ ఎంపవర్మెంట్’ వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు.
ఈ నెల 29న పార్టీ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించనుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని నేతలు సీఎంకు వివరించారు. అలాగే, త్వరలో జరగనున్న మహానాడు నిర్వహణ కమిటీల ఏర్పాటుపైనా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.








