మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలకు గుర్తింపుగా చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు ముత్తిగల రామచంద్రం ప్రతిష్ఠాత్మక అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్నారు.
లైయన్స్ ఇండియన్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సరస్వతి ఆడిటోరియంలో నిర్వహించిన బహుజన ఆత్మీయ సదస్సు కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు డాక్టర్ ఆకుల రమేష్, కృష్ణ గోవర్ధన్ సామ్రాట్ చేతుల మీదుగా రామచంద్రం అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా ముత్తిగల రామచంద్రం మాట్లాడుతూ, తన సామాజిక సేవలను గుర్తించి అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.
సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తులకు ఇలాంటి అవార్డులు ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాడిగళ్ల మల్లేశం, కర్నే సాయిలు తదితరులు పాల్గొని రామచంద్రంను అభినందించారు.








