హన్మకొండ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హన్మకొండ పర్యటనలో ఓ అభిమాని బాలుడి కోరికను తీర్చి హృదయాలను గెలుచుకున్నారు. తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 15 ఏళ్ల నిరంజన్‌ను అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు.
హన్మకొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన నిరంజన్ చిన్న వయసు నుంచే అరుదైన నరాల సమస్యతో బాధపడుతున్నాడు. వయసు 15 సంవత్సరాలు అయినప్పటికీ వ్యాధి ప్రభావంతో అతను రెండేళ్లు, మూడేళ్ల చిన్నారిలా కనిపిస్తుండగా, కాళ్లు కూడా పనిచేయని పరిస్థితిలో జీవితంతో పోరాటం చేస్తున్నాడు. అయితే తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ఒక్కసారి కలవాలని, ఆయన సినిమా డైలాగ్‌ను ఆయన సమక్షంలో చెప్పాలని నిరంజన్ చాలా కాలంగా కోరుకుంటున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్, ప్రత్యేకంగా నిరంజన్ ఇంటికి వెళ్లి అతడిని కలిశారు. బాలుడిని ప్రేమగా పలకరించి, అతనితో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పవన్ కల్యాణ్ రాకతో నిరంజన్ కుటుంబ సభ్యులు, స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కుమారుడి కోరిక నెరవేరడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం భావోద్వేగభరితంగా మారింది.
నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ హన్మకొండలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలు, జనసైనికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అక్కడ కార్యకర్తలతో పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
సమావేశం అనంతరం కార్యకర్తలతో కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత పవన్ కల్యాణ్ విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.
ఇక పవన్ కల్యాణ్ హన్మకొండ పర్యటన నేపథ్యంలో ఆయనను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పలు ప్రాంతాల నుంచి అభిమానులు చేరుకోవడంతో హన్మకొండలో సందడి వాతావరణం నెలకొంది.









