కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల ప్రమాదం పెరుగుతున్నదని, హోటళ్లు మరియు రెస్టారెంట్ల యజమానులు, సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ ఆఫీసర్ భీమయ్య సూచించారు. మంగళవారం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా భీమయ్య మాట్లాడుతూ, వేసవిలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా వంట గదులలో గ్యాస్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలక్ట్రికల్ వైరింగ్‌ను తరచుగా తనిఖీ చేయాలని సూచించారు.
హోటళ్లలో తప్పనిసరిగా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉంచుకోవాలని, వాటి వినియోగంపై సిబ్బందికి సరైన శిక్షణ ఉండాలని తెలిపారు. ప్రమాద సమయంలో వినియోగదారులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఎగ్జిట్ మార్గాలు ఎప్పుడూ ఖాళీగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని, ప్రారంభ దశలోనే అందుబాటులో ఉన్న వనరులతో మంటలను అదుపులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా అగ్నిమాపక శాఖ ఈ తరహా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతోందని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భీమయ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది మధుకర్, ఇమ్రాన్‌తో పాటు స్థానిక హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు.








