జియమ్మవలస : సమష్టి కార్యాచరణతో పక్కా ప్రణాళిక అమలు చేస్తే మలేరియా నియంత్రణ మరింత సులభతరం అవుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు అన్నారు. బుధవారం గిరిజన ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలు బుడ్డుడుగూడ, చింతమానుగూడ, టి.కె. జమ్ము, వనజ గ్రామాలను జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావుతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న “మా ఊరికి మలేరియా వచ్చింది” కార్యక్రమాలను పరిశీలించారు. మలేరియాకు కారణమైన దోమలు, వాటి లార్వా పెరుగుతున్న ప్రదేశాలను గుర్తించి నిర్మూలన చర్యలపై దృష్టి సారించారు. యాంటీ లార్వా ఆపరేషన్, ఐఆర్ఎస్ ఫోకల్ స్ప్రేయింగ్ విధానాలను పరిశీలించి, నీటి నిల్వ ప్రదేశాల్లో లార్వా నివారణ కోసం పంచాయతీ సిబ్బంది ఆయిల్ బాల్స్ వినియోగాన్ని సమీక్షించారు.
గ్రామస్తులకు దోమతెరల వినియోగంపై అవగాహన కల్పిస్తూ వాటి అవసరాన్ని వివరించారు. అలాగే గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను తనిఖీ చేసి నిర్ధారణ పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
వేసవి సెలవుల్లో గ్రామాలకు వచ్చిన వసతి గృహ విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. దోమల లార్వా ఉనికిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టే లక్ష్యంగా “మా ఊరికి మలేరియా వచ్చింది”, “డ్రై డే” కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.
అనంతరం జియమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, వేసవి ఉష్ణోగ్రతలతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యల నమోదుపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో డిఐఓ డా. వై. విజయమోహన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. కెవిఎస్. పద్మావతి, డిఎమ్ఓ డి. సూర్యనారాయణ, వైద్యాధికారులు డా. సుష్మిత, డా. జగదీష్, జిల్లా కన్సల్టెంట్ రామచంద్ర, డిప్యూటీ ఎంపీడీవో సిహెచ్. హరిప్రసాద్, పంచాయతీ సెక్రటరీలు, ఆరోగ్య పర్యవేక్షకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








