కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న నేరాల విచారణ తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
చీటింగ్, ఫోర్జరీ కేసులపై ప్రత్యేక దృష్టి:
ముఖ్యంగా హుజురాబాద్ డివిజన్ వ్యాప్తంగా నమోదైన చీటింగ్ (మోసపూరిత) మరియు ఫోర్జరీ కేసుల ప్రస్తుత స్థితిగతులపై సీపీ ఆరా తీశారు. అమాయక ప్రజలను మోసం చేసే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే కొలిక్కి తీసుకురావాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రస్తుత కాలంలో నేరస్తులు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని, వారిని పట్టుకోవడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఫోరెన్సిక్ ఆధారాలను విరివిగా ఉపయోగించాలని పేర్కొన్నారు. కోర్టులో నేరస్తులకు శిక్ష పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలతో కూడిన ఛార్జ్ షీట్లను నిర్ణీత గడువులోగా దాఖలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ నమ్మకాన్ని పెంపొందించేలా విధులు నిర్వహించాలని సీపీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వి.మాధవి, స్థానిక ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతి లతో పాటు ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.








