కొమరం అసిఫాబాద్ జిల్లా దాహేగాం మండలంలోని ఇట్యాల గ్రామం నుంచి గొర్రెగుట్ట వరకు నిర్మించనున్న నూతన బిటి రోడ్డు పనులకు గురువారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ పనులను సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు.
సుమారు రూ.1.36 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ రోడ్డు నిర్మాణం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కలగనుంది. కార్యక్రమంలో మాట్లాడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డు పనులను నాణ్యతతో పాటు అత్యంత వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
తమ గ్రామానికి బిటి రోడ్డు మంజూరు కావడం పట్ల ఇట్యాల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్సీ దండే విఠల్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సర్పంచ్ గజ్జల జయలక్ష్మి సురేష్‌తో పాటు గ్రామ పెద్దలు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మరియు ఇట్యాల గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.








