కరీంనగర్ జిల్లా పోలీస్ విభాగానికి గర్వకారణంగా నిలిచే విధంగా హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “అఖిల భారత పోలీస్ క్రీడా పోటీలు” (All India Police Games) లో పాల్గొన్న ఆమె అద్భుత ప్రదర్శనతో నాలుగు పతకాలను కైవసం చేసుకుని రాష్ట్ర పోలీస్ శాఖకు, కరీంనగర్ కమిషనరేట్‌కు విశిష్ట గౌరవాన్ని తీసుకువచ్చారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన పోలీస్ క్రీడాకారులతో జరిగిన ఉత్కంఠభరిత పోటీల్లో ఏసీపీ మాధవి ధైర్యసాహసాలు, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా టేబుల్ టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ విభాగాల్లో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం నాలుగు పతకాలను సాధించడం విశేషం.
పోలీస్ విధుల్లో నిబద్ధతతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచిన మాధవిపై సహచర అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆమెను ఘనంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బంది కూడా ఏసీపీ మాధవి సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
ఏసీపీ మాధవి సాధించిన ఈ విజయంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పేరు జాతీయ స్థాయిలో మరింత ప్రతిష్టను సంపాదించిందని పలువురు అభిప్రాయపడ్డారు.









