మెదక్ జిల్లా/ చేగుంట/తూప్రాన్: తూప్రాన్ డివిజన్ పరిధిలోని పలు రైస్ మిల్లులను తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా వడ్ల సేకరణ చేపట్టాలని అధికారులను, మిల్లర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా మాసాయిపేట రైస్ మిల్, ఇబ్రహీంపూర్ తిరుమల రైస్ మిల్, బోనాల భారతి రైస్ మిల్లులను ఆయన సందర్శించారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, మౌలిక వసతులపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
రైతులు తమ పంటను విక్రయించేందుకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆర్డీవో సూచించారు. ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా చూడాలని, రైతులకు తగిన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, మాసాయిపేట ఎమ్మార్వో, ఆర్‌ఐ జయభారత్ రెడ్డి, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఎంపీవో విజయ్‌పాల్ రెడ్డి, రైస్ మిల్ యజమానులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.








