కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన లారీ ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనంతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికుల వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే లారీ వెనకాల బైక్‌పై వెళ్తున్న గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన బుర్ర చంద్రశేఖర్ అప్రమత్తమయ్యాడు. ప్రమాదం అనంతరం పారిపోతున్న లారీని వెంటాడుతూ కరీంనగర్ పట్టణం వరకు వెళ్లాడు.
కరీంనగర్‌లోని రాజా థియేటర్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద లారీలో ఉన్న లోడును కిందికి దించుతున్న సమయంలో చంద్రశేఖర్ డ్రైవర్‌ను గుర్తించి పట్టుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని మాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డికి సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న రవీందర్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా, పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది.
ఈ ఘటనపై స్పందించిన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రమాదం సమయంలో లారీ డీజిల్ ట్యాంక్ లీక్ కావడంతో రోడ్డుపై పడిన డీజిల్ ఆనవాళ్ల ఆధారంగా లారీని వెంబడించి డ్రైవర్‌ను పట్టుకున్నట్లు తెలిపారు.
ప్రమాదానికి గురైన లారీ నంబర్ AP29V1555 కాగా, డ్రైవర్ పేరు మొహాద్ ఎస్సా అని సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








