contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: TUWJ – TJF

ఖమ్మం జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, హౌసింగ్ సొసైటీకి 23.2 ఎకరాల భూమిని వెంటనే అప్పగించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి జర్నలిస్టు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం క్యాబినెట్‌లో ఖమ్మం జర్నలిస్టులకు 23.2 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసినప్పటికీ, ప్రస్తుత పాలకులు ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ నుంచి మయూరి సెంటర్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు జర్నలిస్టులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని అనేక హామీలు ఇచ్చిన పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వంద్వ వైఖరి అవలంబించడం బాధాకరమన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జర్నలిస్టులకు కేటాయించిన భూమిని హౌసింగ్ సొసైటీ ద్వారా పంపిణీ చేయడంలో కాలయాపన చేయడం సరికాదన్నారు.

ఈ నెల 21న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుని వెంటనే ఆమోదం తెలపాలని వారు కోరారు. అలాగే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై అనేక చీకటి జీవోలు జారీ చేస్తూ కోతలు విధించే విధంగా వ్యవహరించడం తగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :