అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. జడ్ వీరారెడ్డి కాలనీ, దాసరి కాలనీ, బీసీ కాలనీ, సిపిఎం కాలనీలలో పార్టీ జెండాలను ఆవిష్కరించి, సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఐద్వా మహిళా నాయకురాలు రేణుక గీతాలాపన చేశారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ, 1934లో నెల్లూరు జిల్లా అలగనిపాడులో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.
వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం కూలి పోరాటాలు, భూమి పోరాటాలు నిర్వహించడంతో పాటు అంటరానితనం నిర్మూలనకు అనేక ఉద్యమాలు చేపట్టి ఆదర్శప్రాయ నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, వ్యవసాయ కార్మికులను సమీకరించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని చెప్పారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు చందు, రామేశ్వరీ, వన్నూరమ్మ, ఊర్మిళ, మున్ని, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.








