కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని పేపర్ మిల్లులో కార్మికుల హక్కుల సాధన కోసం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 10 ప్రధాన డిమాండ్లతో కూడిన బ్యానర్లను ప్రదర్శిస్తూ యాజమాన్యం, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్మికులు ప్రధానంగా గుర్తింపు సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, ప్రస్తుతం కొనసాగుతున్న 10 మంది సభ్యుల కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులను పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకోవడం, సొసైటీ నిధులపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించడం, క్యాంటీన్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సరుకులు అందించడం వంటి అంశాలను ప్రస్తావించారు.
స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు NCLT కోర్టు నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కమిటీ, యాజమాన్యం మధ్య జరిగిన చీకటి ఒప్పంద అగ్రిమెంట్ కాపీని బహిర్గతం చేయాలని, వార్షిక బోనస్‌లో జరిగిన లీకేజీలపై కార్మిక శాఖ అధికారులతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని కార్మిక లోకం కోరుతోంది.








